Last Updated:
నాగచైతన్య నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ 2026 డిసెంబర్‌లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం నాగచైతన్య చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ హైప్ నెలకొనగా, తాజాగా విడుదల తేదీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2026 డిసెంబర్‌లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే విడుదల తేదీపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
సినీ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయట. భారీ విజువల్స్, అడ్వెంచర్ అంశాలు ఎక్కువగా ఉండటంతో గ్రాఫిక్స్ పనులకు ఎక్కువ సమయం అవసరమవుతోందని తెలుస్తోంది. అందుకే చిత్రాన్ని సంవత్సరాంతంలో గ్రాండ్ రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమా కోసం నాగచైతన్య చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ “బీయింగ్ అర్జున్” అని క్యాప్షన్ ఇచ్చారు. సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర పేరు అర్జున్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
ఆ ఫోటోల్లో నాగచైతన్య జిమ్‌లో కఠినంగా వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. సిక్స్‌ప్యాక్ బాడీ, మసిల్స్‌తో ఆయన పూర్తిగా కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఇంతకుముందు ఎప్పుడూ చూడని రఫ్ అండ్ టఫ్ అవతార్‌లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పొడవాటి గడ్డం, సీరియస్ లుక్, మెడపై కనిపించిన గాయాల మచ్చలు సినిమాలో ఆయన పాత్ర ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చెప్పేస్తున్నాయి.
‘వృషకర్మ’ సినిమాలో నాగచైతన్య ఓ ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించబోతున్నారు. అర్జున్ అనే ఈ పాత్ర కోసం ఆయన కేవలం మేకప్‌పై ఆధారపడకుండా తన లుక్‌ను పూర్తిగా మార్చేసినట్లు సమాచారం. శరీరాకృతి నుంచి స్టైల్ వరకు ప్రతిదాంట్లో కొత్తదనం తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారట.
ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘విరూపాక్ష’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు మరోసారి మిస్టరీ, పురాతన రహస్యాల నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్నారు. కథలో అడ్వెంచర్, థ్రిల్, సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా నాగచైతన్య లుక్, కథ నేపథ్యం, అడ్వెంచర్ ఎలిమెంట్స్ కారణంగా అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, అప్‌డేట్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు డిసెంబర్ రిలీజ్ వార్తలతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. మరి ‘వృషకర్మ’ నాగచైతన్య కెరీర్‌లో మరో బిగ్ హిట్‌గా నిలుస్తుందా? అనే ఆసక్తి టాలీవుడ్‌లో పెరుగుతోంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













