Last Updated:
Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని కేవలం అరగంటలోపే గుర్తించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించి కొండపైన భద్రత ప్రమాణాలు పటిష్టంగా ఉన్నాయని మరోసారి రుజువు చేశారు.
Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని కేవలం అరగంటలోపే గుర్తించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించి కొండపైన భద్రత ప్రమాణాలు పటిష్టంగా ఉన్నాయని మరోసారి రుజువు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం తిరుమలలోని సీఆర్వో సమీప ప్రాంతాల్లో పోలీసులు, విజిలెన్స్ అధికారులు , సిబ్బంది సంయుక్తంగా ఏరియా డామినేషన్ నిర్వహిస్తుండగా కళ్యాణి సత్రం ముందు ఒక చిన్నారి ఒంటరిగా ఏడుస్తూ కనిపించాడు. వెంటనే స్పందించిన పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది బాలుడిని చేరదీసి అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, చిన్నారి తన వివరాలను స్పష్టంగా చెప్పలేకపోయాడు.దీంతో వెంటనే బాలుడి ఫోటో, వివరాలను స్థానిక సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పంపించడంతో పాటు కమాండ్ కంట్రోల్, ట్రాఫిక్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు బాలుడు తప్పిపోయిన అరగంటలోపే అతని కుటుంబ సభ్యులను గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాకు చెందిన రాజేష్, సరిత దంపతుల కుమారుడు మోహిత్గా బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి అందించినందుకు బాలుడి తల్లిదండ్రులు పోలీసులు, విజిలెన్స్ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వెంటే తీసుకొచ్చే చిన్నపిల్లలు, వృద్ధుల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తిరుమల పోలీసులు కోరారు. రద్దీ ప్రాంతాల్లో పిల్లలను లేదా వృద్ధులను ఒంటరిగా వదిలి వెళ్లకూడదని, వారి జేబులో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలు రాసిన చీటీ ఉంచితే అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ. ఈసందర్భంగా భక్తులకు పలు సూచనలు చేశారు.తిరుమలలో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోయిన ఘటనల్లో పోలీసులు, విజిలెన్స్, కమాండ్ కంట్రోల్ విభాగాలు సమన్వయంతో వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకు అప్పగించే విధంగా నిరంతరం పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ సగటున ఆరుగురు నుంచి ఏడుగురు వరకు తప్పిపోయిన వారిని గుర్తించి వారి బంధువులకు అప్పగిస్తున్నామని వెల్లడించారు.
భక్తుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తిరుమలలో ప్రతిరోజూ పోలీసులు, విజిలెన్స్ ఇతర శాఖల సమన్వయంతో ఏరియా డామినేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ చర్యల వలన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల్లో మరింత భద్రతాభావం పెరిగి, వారు ప్రశాంతంగా దర్శనం పూర్తి చేసుకొని సంతృప్తికరంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirumala,Chittoor,Andhra Pradesh













