Last Updated:
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. అలాగే ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి శనివారం రాత్రి పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్ వద్ద క్యూ లైన్లను పరిశీలించారు. తిరుమలలో భక్తుల రద్దీ పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ రోజుల్లోనే రోజుకు 85 వేల నుంచి 87 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం టీటీడీ అధికారులు, ఉద్యోగులు, విజిలెన్స్, పోలీసులు, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, వైద్య విభాగాల సిబ్బంది రాత్రింబవళ్లు సేవలందిస్తున్నారని తెలిపారు.
శనివారం మాత్రం పరిస్థితి మరింత భిన్నంగా ఉందన్నారు. తిరుమల చరిత్రలోనే అరుదుగా కనిపించేలా లక్షన్నర మందికి పైగా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారని చెప్పారు. దాదాపు 30 గంటలు దర్శనానికి టైమ్ పడుతుంట. భారీ రద్దీ ఉన్నప్పటికీ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఆదివారం కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. అధికారులు, ఉద్యోగుల సెలవులు పూర్తిగా రద్దు చేశామని, అందరినీ విధుల్లో కొనసాగిస్తున్నామని తెలిపారు. అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించి భక్తుల రద్దీని నియంత్రిస్తున్నామని చెప్పారు.
సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే రోజూ ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా ఇచ్చే 800 శ్రీవాణి దర్శన టికెట్లను కూడా నిలిపివేసినట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌డీతో పాటు మరికొన్ని ప్రత్యేక దర్శనాల కోటాలను కూడా అవసరానికి అనుగుణంగా తగ్గించి, ఆ సమయాన్ని సర్వదర్శనం భక్తులకు కేటాయిస్తున్నామని చెప్పారు.
తిరుమలలోని వసతి సముదాయాలు, క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు ఈవో తెలిపారు. తాగునీరు, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, వైద్య సేవలు నిరంతరం అందిస్తున్నామని చెప్పారు.
అలాగే శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు గర్భగుడి వద్ద ఎక్కువసేపు నిల్చోకుండా వెంటనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. వెనుక వేలాది మంది భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. భక్తులందరికీ వీలైనంత త్వరగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడమే టీటీడీ ప్రధాన లక్ష్యమని అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
Hyderabad,Telangana
Jun 28, 2026 11:49 AM IST












