Tirumala Brahmotsavam 2026: నాలుగోరోజు తిరుమలలో సర్వభూపాల వాహనసేవ.. గజేంద్ర మోక్ష అలంకారంలో శ్రీమలయప్ప స్వామి! | | ACTPnews

News18


Last Updated:

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో వైభవంగా సాగిన వాహనసేవను పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించగా, కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

+

News18

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన ఈ వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గజేంద్ర మోక్ష అలంకారంలో కొలువుదీరిన శ్రీమలయప్పస్వామివారిని కనులారా దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వాహనసేవ సందర్భంగా వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మాడ వీధుల్లో భక్తుల గోవిందనామస్మరణలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. ఈ వాహనంలో అష్టదిక్పాలకులు కూడా కొలువుదీరుతారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరృతి, పశ్చిమాన వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతారు. అష్టదిక్పాలకులంతా శ్రీమహావిష్ణువును తమ భుజస్కంధాలపై, హృదయంలో కొలువుంచి సేవిస్తారనే భావనకు సర్వభూపాల వాహనం ప్రతీకగా నిలుస్తుంది.

శ్రీమలయప్పస్వామివారి అనుగ్రహంతో రాజ్యపాలన సుభిక్షంగా సాగి, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ వాహనసేవ చాటిచెబుతుంది. యశోప్రాప్తికి, సర్వలోక క్షేమానికి ప్రతీకగా నిలిచే సర్వభూపాల వాహనసేవను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో వీక్షించారు. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports