Top 10 News: తెలంగాణలో రాజకీయ వేడి.. ఏపీలో వర్షాల ముప్పు.. ఈరోజు టాప్ 10 న్యూస్ | | ACTPnews

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు


ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఆయన, సాయంత్రం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్‌తో సమావేశమయ్యారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ భేటీకి హాజరయ్యారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు తెలంగాణలోని పలు నీటిపారుదల ప్రాజెక్టులపై వారు చర్చిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్‌ నిర్ణయం

సింగరేణి బొగ్గును వదులుకుని విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయమని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR విమర్శించారు. టన్ను సింగరేణి బొగ్గు ధర రూ.3,800 మాత్రమే. కానీ ప్రభుత్వం టన్ను రూ.9,000 పెట్టి విదేశీ బొగ్గు కొంటోంది. ఈ నిర్ణయం ఎవరి ప్రయోజనం కోసం తీసుకున్నారని KTR ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై ఈ భారాన్ని ఎందుకు మోపుతున్నారో చెప్పాలని నిలదీశారు. KCR పాలనలో సింగరేణి బొగ్గుతోనే 24 గంటల విద్యుత్ ఇచ్చామని ‘X’ వేదికగా గుర్తుచేశారు.

నోరు జారితే… ఆడోళ్లతో కొట్టిస్తా..!

కాంగ్రెస్‌ నేతలంతా వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ పిలుపునిచ్చారు. కొంతమంది నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. ఇష్టానుసారం మాట్లాడితే మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తామని స్పష్టం చేశారు. ఒక్కో మహిళ నలుగురిని కొడుతుందని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రతిపక్ష నేతలు గాల్లో కత్తులు తిప్పుతున్నారని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.

జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తోంది..

కేంద్రం అండతో రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా రామాపురంలో జరిగిన ‘పల్లె పండుగ 3.0’ సభలో పవన్ కల్యాణ్, బీజేపీ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పల్లె పండుగ కోసం రూ.11,085 కోట్లు కేటాయించామని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖలో గొప్ప మార్పులు వచ్చాయని ప్రశంసించారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చామని, తల్లికి వందనం, స్త్రీశక్తి పథకాల ద్వారా మహిళలకు అండగా నిలిచామని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలోని ఎస్‌ఎంఎస్-1 విభాగాంలో సాంకేతిక లోపంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ గేట్ తెరుచుకోవడంతో అధిక ఉష్ణోగ్రత కలిగిన ఉక్కుద్రవం కిందకు ఒలికింది. దీంతో కార్మికులు భయాందోళనతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ప్రమాదాన్ని ముందుగానే గమనించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్లాంట్ భద్రతా ప్రమాణాలను వెంటనే సమీక్షించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ముస్లింలను ఓటర్లుగానే చూశారు..

ముస్లింలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, సమాన భాగస్వాములుగా గుర్తించడం లేదని ఆరోపించారు. నెహ్రూ నుంచి మోదీ వరకు పాలకులు మైనారిటీల ఎదుగుదలను అడ్డుకున్నారని మండిపడ్డారు. 18 కోట్ల జనాభా ఉన్న ముస్లింలకు పార్లమెంట్‌లో కేవలం 4 శాతం ప్రాతినిధ్యమే ఉండడం ఆందోళనకరమని ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ, తెలంగాణకు అలర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. బుధ, గురువారాల్లో తెలంగాణలో వర్ష ప్రభావం తగ్గి పొడి వాతావరణం ఉంటుంది. ఈదురుగాలులు, ఉరుముల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.

మేడారంలో ‘ది ప్యారడైజ్’ టీమ్

నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మంచి విజయం అందుకుంది. మొదట నెగిటివ్ టాక్ వచ్చినా, ఆ తర్వాత మెల్లిగా పాజిటివ్‌గా మారింది. ఈ విజయంతో చిత్రయూనిట్ మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంది. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సంపూర్ణేష్ బాబు, కాసర్ల శ్యామ్‌లు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. నాని అమ్మవారికి వస్త్రాలు సమర్పించడంతో పాటు గోవిందరాజు, పగిడిద్ద రాజులను కూడా దర్శించుకున్నారు.

కళ్లముందే చిన్ననాటి రాముడు..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి నవంబర్ 8న విడుదల కానుంది. ఇటీవల ఒక ఈవెంట్‌లో సాయి పల్లవి మాట్లాడుతూ.. రణబీర్ శ్రీరాముడి లుక్‌లో చిన్ననాటి రాముడిలా అమాయకంగా, ప్రశాంతంగా కనిపించారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

త్వరలోనే ఇరాన్‌పై విజయం..

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో త్వరలోనే విజయం సాధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందే సైనిక దాడులు జరిగే అవకాశం ఉందనే విషయాన్ని ఆయన తోసిపుచ్చలేదు. ఇరాన్‌కు అణ్వాయుధాలు దక్కకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సైనిక, ఆర్థిక ఒత్తిళ్ల ద్వారా ఇరాన్‌పై అమెరికా విజయం సాధిస్తోందని చెప్పారు. ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, అక్కడ ద్రవ్యోల్బణం 300 శాతానికి చేరిందని ట్రంప్ పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports