Last Updated:
Trump: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలు, యుద్ధ సమీకరణాలు క్షణక్షణం మారుతున్నాయి.
యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై భారీ ఎత్తున వైమానిక దాడులు జరిపేందుకు అమెరికా సైన్యం దాదాపు రంగం సిద్ధం చేసుకున్న సమయంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషంలో ఆ దాడుల ప్రణాళికను విరమించుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా బలగాలు యుద్ధ విమానాల్లోకి బాంబులను లోడ్ చేయడం, లక్ష్యాలను ఖరారు చేసుకోవడం వంటి అన్ని సన్నాహాలు పూర్తి చేసిన తర్వాత ఇలా ఆపరేషన్ రద్దు కావడం అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎర్ర సముద్ర తీరప్రాంతాల్లోని వ్యూహాత్మక ప్రాంతాలను హూతీలు క్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ సౌదీ సరిహద్దుల వైపు దూసుకొస్తున్నారు. కీలకమైన బాబ్ అల్-మందెబ్ జలసంధి సమీపంలో వారి ఆధిపత్యం పెరగడం సౌదీ అరేబియా భద్రతకు తీవ్ర సవాలుగా మారింది. దీంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హూతీలపై అత్యవసరంగా సైనిక చర్యలు చేపట్టాలని, వైమానిక మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.
మిత్రదేశమైన సౌదీ విజ్ఞప్తి మేరకు ట్రంప్ మొదట వైమానిక దాడులకు సిద్ధం కావాల్సిందిగా పెంటగాన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే దాడులు కార్యరూపం దాల్చే కొద్ది గంటల ముందే ట్రంప్ తన వైఖరిని మార్చుకుని, తాత్కాలికంగా ఆ చర్యలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఈ అనూహ్య నిర్ణయం వెనుక ట్రంప్ అంతర్గత సలహాదారుల వ్యతిరేకత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో పలు ప్రాంతాల్లో సైనిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో యెమెన్ సంక్షోభంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని మరో దీర్ఘకాలిక యుద్ధంలో చిక్కుకోవడం సరైంది కాదని ట్రంప్ బృందం బలంగా వాదించినట్లు సమాచారం. కేవలం గగనతల దాడులతో హూతీలను అణచివేయడం అసాధ్యమని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు గుర్తుచేశారు.
మరోవైపు, హూతీ రాజకీయ విభాగం నేతలు తాము ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను గానీ, ఇతర అంతర్జాతీయ వాణిజ్య నౌకలను గానీ లక్ష్యంగా చేసుకోబోమని ప్రకటించారు. ఇతర దేశాలు సౌదీ అరేబియాతో చేతులు కలిపి తమపై ప్రత్యక్ష దాడులకు దిగనంత వరకు తాము ఎవరి జోలికీ వెళ్లబోమని హూతీ ప్రతినిధి మొహమ్మద్ అల్-బుఖైతీ తెలిపారు. హూతీల నుంచి ఇలాంటి సంకేతాలు రావడం, వారి దాడుల ముప్పు ప్రస్తుతానికి తగ్గడంతోనే అమెరికా వైమానిక చర్యను వాయిదా వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఉద్రిక్తతలు సద్దుమణిగినట్లు కనిపించినా, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో సమీకరణాలు ఎలా మారతాయో వేచి చూడాల్సిందే.










