Last Updated:
నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన కొత్త సినిమా అగ్లీ స్టోర్. ఇది బావమరదళ్ల నడుమ నడిచే ఎమోషనల్ స్టోరీ. మరి నేడే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా..
అగ్లీ స్టోరీ చిత్రంతో దర్శకుడు ప్రణవ్ స్వరూప్ ఒక భావోద్వేగభరితమైన సైకాలజికల్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శివాజీ రాజా, రవితేజ మహాదశ్యం, ప్రగ్య నయన్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ అందించారు. ఈ రోజు (మే 22) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..
కార్తీక్ (నందు), నేహా (అవికా గోర్) చిన్నప్పటి నుంచి ఒకే కుటుంబంలో పెరిగిన బావమరదళ్లు. నేహా చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆమెను మామయ్య నారాయణరావు (శివాజీ రాజా) తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. చిన్నప్పటి నుంచే కార్తీక్‌కు నేహానే తన భవిష్యత్తు భార్య అని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. అయితే నేహా మాత్రం తన బాల్య స్నేహితుడు గౌతమ్ (రవితేజ మహాదశ్యం)ను ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత కార్తీక్ మానసికంగా ఎలా మారాడు? ప్రేమ, ఆత్మీయత, స్వార్థం మధ్య అతని వ్యక్తిత్వం ఎలా మారిపోయింది? గౌతమ్-నేహా ప్రేమకు అతను అడ్డుగా నిలిచాడా? లేక వారి జీవితాల్లో మార్పుకు కారణమయ్యాడా? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది.
‘అగ్లీ స్టోరీ’ సాధారణ ప్రేమకథలా ప్రారంభమైనా, క్రమంగా సైకాలజికల్ ఎమోషనల్ డ్రామాగా మారుతుంది. ప్రేమ పేరుతో వ్యక్తుల్లో వచ్చే మానసిక మార్పులు, ఒంటరితనం, స్వాధీన భావన వంటి అంశాలను దర్శకుడు బలంగా చూపించే ప్రయత్నం చేశారు.ముఖ్యంగా ప్రధాన పాత్ర చుట్టూ కథను నిర్మించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల్లో ఒకేసారి ఆ పాత్రపై కోపం, జాలి కలిగేలా కథనం నడిపించడం దర్శకుడి ప్రత్యేకతగా చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాలు సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను గుర్తు చేస్తాయి. అక్కడక్కడా స్లో నేరేషన్ కనిపించినా సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా కథ నడిపించారు డైరెక్టర్. స్టోరీని ఇంకాస్త క్రిస్ప్ చేస్తే వేరే లెవెల్ లో ఉండేది కానీ ఉన్నంతలో అయితే మెప్పించారు.
ఈ చిత్రంలో నందు తన కెరీర్లోనే భిన్నమైన పాత్రలో కనిపించారు. ఎమోషనల్ షేడ్స్‌తో పాటు మానసిక అస్థిరతను ప్రతిబింబించే సన్నివేశాల్లో అద్భుతమైన నటన కనబరిచారు. అతని ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ పాత్రను మరింత బలంగా నిలబెట్టాయి. అవికా గోర్ అమాయకత్వంతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో మెప్పించింది. రవితేజ మహాదశ్యం పాత్ర చిన్నదైనా కథకు మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. శివాజీ రాజా కుటుంబ పెద్ద పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రగ్య నయన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పరిమిత స్క్రీన్ టైమ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సైకాలజికల్ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. ప్రతి సన్నివేశాన్ని భావోద్వేగానికి తగ్గట్టుగా విజువల్‌గా ప్రెజెంట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని ఇంటెన్సిటీని మరింత పెంచింది. ఎడిటింగ్ కచ్చితంగా ఉండగా, నిర్మాణ విలువలు కూడా మంచి స్థాయిలో కనిపించాయి.
నందు అద్భుతమైన నటన
భావోద్వేగభరితమైన కథనం
దర్శకుడి టేకింగ్
కొన్ని సన్నివేశాలు కాస్త హార్ష్‌గా అనిపించవచ్చు
స్లో నేరేషన్
‘అగ్లీ స్టోరీ’ ప్రేమ, మానసిక పరిస్థితులు, భావోద్వేగాల మధ్య జరిగే సంఘర్షణను చూపించే ఇంటెన్స్ డ్రామా. థ్రిల్లింగ్ ఎమోషనల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ మూవీ మంచి అనుభూతిని ఇస్తుంది.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













