Vinod kambli: సచిన్ కంటే తోపు ప్లేయర్ అవుతాడనుకున్నారు.. కట్‌చేస్తే వృద్ధాశ్రమంలో ఏకాకిగా మిగిలిపోయాడు | క్రీడా వార్తలు | ACTPnews

PC: x.com


Last Updated:

Vinod kambli: ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించి, అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన భారత మాజీ బ్యాటర్‌ వినోద్‌ కాంబ్లీ జీవితం ఇప్పుడు అత్యంత విషాదకరమైన మలుపు తిరిగింది.

PC: x.com
PC: x.com

తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన, ప్రస్తుతం థానేలోని ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రం నుంచి ఆయన మాట్లాడిన ఒక చిన్న వీడియో క్లిప్‌ సెప్టెంబరు 25న సోషల్‌ మీడియాలో బయటకు రావడంతో, క్రికెట్‌ ప్రపంచంతో పాటు అభిమానులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వీడియోలో వినోద్‌ కాంబ్లీ మాట్లాడుతూ తీవ్రంగా తడబడటం కనిపించింది. గత కొంతకాలంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మునుపటిలా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. అయినప్పటికీ, ఆశ్రమంపై ఆయన ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. “నేను వినోద్‌ కాంబ్లీని. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఎంతో ప్రేమ లభించింది. ఇక్కడున్న వారిని చూస్తుంటే సొంత ఇంట్లో లేనన్న భావన కలగడం లేదు. ఇక్కడి వసతులు, పరిశుభ్రత అత్యున్నత స్థాయిలో ఉన్నాయి” అంటూ ‘నిదాన్‌’ కేర్‌ సెంటర్‌ నిర్వాహకులను ఆయన స్వయంగా ప్రశంసించారు.

గత కొన్నేళ్లుగా కాంబ్లీ పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. గతంలో యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ (యూటీఐ), తీవ్రమైన లో-బ్లడ్‌ ప్రెజర్‌ సమస్యలతో ఆయన థానేలోని ఓ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా ఆయన కండరాల పనితీరు, నడక ప్రభావితమైనట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా, గతంలో వచ్చిన బ్రెయిన్‌ స్ట్రోక్‌కు సంబంధించిన పాత రక్తపు గడ్డలు కూడా ఆయన మెదడులో ఉన్నట్లు తేలింది. దాదాపు రెండు వారాల పాటు చికిత్స పొందిన అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అంతకుముందు, ఆయన నడవలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఇంటికి వచ్చిన సన్నిహితులతో మాట్లాడుతూ.. “దేవుడి దయ వల్ల నెట్టుకొస్తున్నాను, బానే ఉన్నాను” అంటూ అందరినీ ఓదార్చే ప్రయత్నం చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన బాల్యమిత్రుడు సచిన్‌ టెండూల్కర్‌ చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ.. తనకు జరిగిన రెండు శస్త్రచికిత్సల ఖర్చులను సైతం సచిన్ భరించాడని కాంబ్లీ స్వయంగా వెల్లడించారు.

పాఠశాల రోజుల్లోనే సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి శారదాశ్రమం విద్యామందిర్‌ తరఫున అజేయంగా 664 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి కాంబ్లీ రికార్డు సృష్టించారు. 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆయన, టీమ్‌ఇండియా తరఫున 17 టెస్టులు ఆడి 54.20 సగటుతో నాలుగు సెంచరీలతో కలిపి 1,084 పరుగులు చేశారు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డబుల్‌ సెంచరీలు (ఇంగ్లాండ్‌పై 224, జింబాబ్వేపై 227) బాదిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కారు. అలాగే 104 వన్డేల్లో 2,477 పరుగులు సాధించారు.

ఒకప్పుడు ప్రపంచ మేటి బౌలర్లను తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో హడలెత్తించిన ఒక స్టార్ బ్యాటర్, నేడు ఇలా వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్న తీరు చూసి క్రీడాలోకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. క్రీడా జీవితం ముగిసిన తర్వాత ఒక అథ్లెట్ జీవితం ఎంత వేగంగా తలకిందులు కావచ్చో చెప్పడానికి కాంబ్లీ పరిస్థితే స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed