Last Updated:
నెట్టింట వణుకుపుట్టిస్తున్న వీడియో.. ఆ ఒక్క సెకను ఏమాత్రం ఆలస్యమైనా ఏమయ్యేదో తెలుసా?
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (ఓఆర్ఆర్) ప్రయాణిస్తున్న ఓ ప్రొఫెసర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రాంగ్ రూట్‌లో వేగంగా వస్తున్న భారీ ట్రక్కును చూసి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం ముప్పు నుంచి ఆయన తృటిలో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు కారు డాష్ క్యామ్‌లో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఓఆర్ఆర్ లాంటి అతివేగంగా వాహనాలు ప్రయాణించే మార్గాల్లో కనీస నిబంధనలు పాటించకపోతే జరిగే అనర్థాలు ఎలా ఉంటాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
ప్రొఫెసర్ సరిత్ చందా శంషాబాద్ ఎంట్రీ నుంచి ఓఆర్ఆర్‌పైకి ప్రవేశించిన కాసేపటికే ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ డాష్ క్యామ్ వీడియోను ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను ఓ మలుపు తిరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక ఆర్‌ఎంసీ ట్రక్కు రాంగ్ సైడ్ నుంచి దూసుకువచ్చిందని, దేవుడి దయ వల్లే తాను బతికిపోయానని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఈ భయానక వీడియో క్షణాల్లో వేలాది మందికి చేరిపోయింది. ఆ ట్రక్కు డ్రైవర్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.
డాష్ క్యామ్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే ప్రమాద తీవ్రత ఇట్టే అర్థమవుతుంది. వన్ వేగా ఉన్న ఆ రహదారిపై ప్రొఫెసర్ తన కారులో వెళ్తూ ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అటువైపు నుంచి రాంగ్ రూట్‌లో ఆర్‌ఎంసీ ట్రక్కు రావడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రెప్పపాటు వ్యవధిలో ఆ ట్రక్కును గమనించిన చందా.. వెంటనే తన కారును పక్కకు తిప్పడంతో ఘోర ప్రమాదం తప్పింది. అయితే వీడియోను స్పీడ్‌గా అప్‌లోడ్ చేయడం వల్లే కారు వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోందని, వాస్తవానికి తాను చాలా నెమ్మదిగానే డ్రైవింగ్ చేస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి నిర్లక్ష్యంగా రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని కామెంట్లు పెడుతున్నారు. ఏమాత్రం కనికరం లేకుండా ఇలాంటి వాహనదారులపై కఠినమైన జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. హైవేలపై రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతా నియమాలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని కొందరు సూచిస్తున్నారు.
Dear sir, upon receiving the information, the @shotr_rgia conducted an enquiry into the incident and successfully traced the driver of the RMC lorry.
The driver was subsequently produced before the @psshmbad_cyb , for initiating the necessary legal action as per law.… pic.twitter.com/Z1sFcuT6qs
— Hyderabad Traffic Police (@HYDTP) July 21, 2026
ఈ వ్యవహారంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. నెటిజన్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్జీఐఏ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఆర్‌ఎంసీ లారీ డ్రైవర్‌ను విజయవంతంగా గుర్తించినట్లు పోలీసులు అధికారికంగా ఎక్స్ వేదికగా బదులిచ్చారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ఎంతటి ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. భవిష్యత్తులో నగర రోడ్లపై ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పౌరులు సైతం ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి.
Hyderabad,Telangana














