అమెరికా హెచ్-1బీ వీసాదారులకు బంపర్ న్యూస్.. 7 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డ్ ఛాన్స్! | | ACTPnews

అమెరికా హెచ్-1బీ వీసాదారులకు బంపర్ న్యూస్.. 7 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డ్ ఛాన్స్! |


ఇటీవల రిపబ్లికన్ పార్టీ సెనెటర్ టిమ్ షీహీ హెచ్-1బీ వీసాల జారీని మూడు సంవత్సరాల పాటు నిలిపివేయాలని సెనెట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన చర్చనీయాంశంగా మారిన కొద్ది రోజులకే డెమోక్రటిక్ పార్టీ భిన్నమైన దిశలో ముందుకొచ్చింది.

పీటీఐ వార్త సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియా సెనెటర్ అలెక్స్ పాడిల్లా గత ఏడాది ప్రవేశపెట్టిన ‘Renewing Immigration Provisions of the Immigration Act of 1929’ బిల్లుకు సోమవారం మరోసారి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అమెరికా వలస చట్టాలు కాలానుగుణంగా మారలేదని, వాటిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో వలసదారులపై అమలవుతున్న కఠిన విధానాలకు ప్రత్యామ్నాయంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఈ బిల్లు ప్రకారం, అమెరికాలో కనీసం ఏడు సంవత్సరాల పాటు నిరంతరాయంగా నివసించిన వారు గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత పొందుతారు. హెచ్-1బీ వీసాదారులు, చిన్నతనంలో అమెరికాకు తీసుకువెళ్లబడిన డ్రీమర్స్, తాత్కాలిక రక్షిత హోదా (TPS) పొందినవారు, దీర్ఘకాల వీసాదారుల పిల్లలు, అత్యవసర సేవల ఉద్యోగులు, అలాగే ఉన్నత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు ఈ బిల్లుతో ప్రయోజనం పొందే అవకాశముంది.

అలెక్స్ పాడిల్లా మాట్లాడుతూ, ఏడాది క్రితం తాను ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కష్టపడి పనిచేసే వలసదారుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న విధానాలను ఎదుర్కోవడమే లక్ష్యమని చెప్పారు. అయితే అప్పటి నుంచి ట్రంప్ ప్రభుత్వ చర్యలు మరింత కఠినంగా మారాయని, ఎన్నో కుటుంబాలు అనిశ్చితిలో జీవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి దీర్ఘకాలంగా సేవలందిస్తున్న లక్షలాది మందిని ఇకపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయకూడదని, వలస చట్టాలను ఆధునికీకరించి శాశ్వత నివాసానికి న్యాయమైన మార్గం కల్పించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

ఈ ప్రతిపాదిత చట్టం అమల్లోకి వస్తే 80 లక్షల మందికి పైగా దీర్ఘకాల నివాసితులకు గ్రీన్‌కార్డ్ పొందేందుకు మార్గం సుగమమవుతుందని అంచనా. ఇందుకోసం అమెరికా Immigration and Nationality Actలోని సెక్షన్-249 (Registry Provision)లో సవరణలు చేయాలని బిల్లు సూచిస్తోంది. ఈ నిబంధన ప్రకారం, నిర్దిష్ట తేదీకి ముందు అమెరికాలో నివసిస్తూ ఇతర అర్హతలు కలిగిన వారికి హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి శాశ్వత నివాస హోదా మంజూరు చేసే అధికారం ఉంది.

సెక్షన్-249ను మొదట 1929లో చట్టబద్ధం చేయగా, చివరిసారిగా 1986లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ హయాంలో సవరించారు. ప్రస్తుతం ఈ నిబంధన కింద అర్హత పొందాలంటే 1972 జనవరి 1కు ముందు అమెరికాలో ప్రవేశించి ఉండాలి. ఈ స్థిరమైన కట్-ఆఫ్ తేదీ వల్ల చట్టం దాదాపు నిర్వీర్యమైందని పాడిల్లా పేర్కొన్నారు. అందుకే నిర్దిష్ట తేదీకి బదులుగా నిరంతరం ముందుకు సాగే (Rolling Eligibility Date) అర్హత విధానాన్ని అమలు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. దీంతో ప్రతి కొన్నేళ్లకోసారి కాంగ్రెస్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

పాడిల్లా కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్ట్రీ నిబంధన కింద 2015 నుంచి 2019 మధ్య కేవలం 305 మంది మాత్రమే తమ వలస హోదాను మార్చుకోగలిగారు. 1972 కట్-ఆఫ్ తేదీ కారణంగా ఈ నిబంధన ప్రస్తుతం పెద్దగా ఉపయోగపడటం లేదని పేర్కొన్నారు.

ఈ బిల్లుకు సెనెట్ డెమోక్రటిక్ విప్ డిక్ డర్బిన్ సహా కోరీ బుకర్, ట్యామీ డక్‌వర్త్, ఆండీ కిమ్, బెన్ రే లుజాన్, ఎడ్వర్డ్ జే మార్కీ, జెఫ్ మెర్క్లీ, క్రిస్ మర్ఫీ, పాటీ ముర్రే, బెర్నీ సాండర్స్, బ్రియాన్ షాట్జ్, ఆడమ్ షిఫ్, టీనా స్మిత్, ఎలిజబెత్ వారెన్ వంటి పలువురు డెమోక్రటిక్ సెనెటర్లు మద్దతు ప్రకటించారు. అదనంగా 30కిపైగా సంస్థలు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి.

అమెరికా ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్ వ్యవస్థలో చాలా కాలంగా భారీ పెండింగ్ సమస్య కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రతి దేశానికి విధించిన 7 శాతం వార్షిక పరిమితి కారణంగా భారతీయ హెచ్-1బీ నిపుణులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఐటీ, సైన్స్ తదితర రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు ప్రతి ఏడాది గ్రీన్‌కార్డ్‌కు దరఖాస్తు చేస్తున్నప్పటికీ, భారత్ నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య కేటాయించిన పరిమితిని మించిపోవడంతో భారీ నిరీక్షణ జాబితా ఏర్పడుతోంది. ప్రస్తుతం ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్ పెండింగ్ కేసుల్లో దాదాపు 80 శాతం భారతీయులవేనని అంచనాలు సూచిస్తున్నాయి. కొందరు భారతీయ నిపుణులు గ్రీన్‌కార్డ్ కోసం 15 సంవత్సరాల నుంచి పలుదశాబ్దాల వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అలెక్స్ పాడిల్లా ప్రతిపాదించిన బిల్లు భారతీయ హెచ్-1బీ వీసాదారులకు కీలక ఉపశమనం కలిగించే అవకాశంగా భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports