తిరుమలలో దివ్య కళ్ల్యాణ వేడుకలు.. కన్నుల పండుగా పద్మావతి పరిణయోత్సవాలు..! | | ACTPnews

తిరుమ‌ల‌లో


Last Updated:

తిరుమల నారాయణగిరిలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభం, ఏప్రిల్ 27 వరకు జరిగే ఈ మహోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు

+

తిరుమ‌ల‌లో వైభ‌వంగా ప్రారంభమైన శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు..!

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు శనివారం సాయంత్రం భూలోక వైకుంఠాన్ని తలపించేలా మారిపోయాయి. సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో అలంకరించిన దశావతార.. అష్టలక్ష్మి మండపం దివ్య కాంతులతో కళకళలాడగా, శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్న ఈ మహోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి.

కలియుగంలో ధర్మసంస్థాపనార్థం వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు నిత్యోత్సవ ప్రియుడు. ఆయన వైభవాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఒక్క జన్మ సరిపోదని భక్తులు భావిస్తారు. టీటీడీ నిర్వహించే నిత్య, వార, పక్ష, మాస, సాలకట్ల ఉత్సవాల్లో పద్మావతి పరిణయోత్సవాలు ప్రత్యేకమైనవి. ఈ వేడుకల్లో శ్రీవారిని నవ వరుడిగా, పద్మావతి దేవిని నవ వధువుగా దర్శించడం భక్తులకు అరుదైన పుణ్యఫలంగా భావిస్తారు.

శాస్త్రాల ప్రకారం, కలియుగ ఆరంభంలో వైకుంఠం నుంచి భూలోకానికి అవతరించిన శ్రీ మహావిష్ణువు, శ్రీవేంకటేశ్వరునిగా వెలసి, నారాయణవనాన్ని పాలించిన ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పరిణయం చేసుకున్నారు. వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగిన ఆ దివ్య కల్యాణానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 1992 నుంచి కొనసాగుతున్న ఈ వేడుకలు నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరిలో జరుగుతుండటం విశేషం.

మూడురోజుల ఈ మహోత్సవాల్లో తొలిరోజు గజవాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు శోభాయాత్రగా విచ్చేయగా, ఉభయనాంచారులు పల్లకీల్లో పరిణయ మండపానికి చేరుకున్నారు. పూలతో అలంకరించిన పెండ్లిమండపంలో ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ వంటి వేడుకలు కోలాహలంగా జరిగాయి. అనంతరం స్వామివారి ఆస్థానం నిర్వహించగా, వివిధ రాగ-తాళ వాయిద్యాల మధ్య కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా సాగింది.

అనంతరం భక్తులకు వస్త్ర బహుమానాలు, ప్రసాద వితరణ చేపట్టారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు అశేష భక్తజనాల మధ్య ఊరేగుతూ ఆలయానికి చేరుకోవడంతో తొలిరోజు వేడుకలు ఘనంగా ముగిశాయి. తిరుమలలో ప్రతి మూల కూడా భక్తి పరిమళాలతో నిండిపోగా, రాబోయే రెండు రోజుల వేడుకల కోసం భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports