Last Updated:
‘పెద్ది’ సినిమాపై కొనసాగుతున్న వివాదాల మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించి రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా, మరోవైపు సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ పాత్రను అతిగా గ్లామరైజ్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్, ఇటీవల ‘పెద్ది’ సినిమాను వీక్షించారు. సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
అల్లు అర్జున్ తన పోస్టులో రామ్ చరణ్ నటనను కొనియాడుతూ, “నిన్న రాత్రి ‘పెద్ది’ చూశాను. నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో రా అండ్ గ్రిటీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పాత్ర కోసం చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, డ్యాన్స్ మూవ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ అతడు తన ప్రతిభను నిరూపించుకున్నాడు. నా సోదరుడి విజయాన్ని చూసి నిజంగా గర్వంగా ఉంది. అతడు అందుకుంటున్న ప్రతి ప్రశంసకు పూర్తిగా అర్హుడు” అని పేర్కొన్నారు.
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…
— Allu Arjun (@alluarjun) June 9, 2026
అంతేకాకుండా సినిమాలో నటించిన ఇతర కళాకారులపై కూడా అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. జగపతి బాబు నటన ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొంటూ, జాన్వీ కపూర్‌కు తన ప్రేమాభిమానాలను తెలియజేశారు. అలాగే చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, నిర్మాతలను అభినందించారు. దర్శకుడు బుచ్చిబాబు సానాను ఉద్దేశించి, “సినిమాలో ప్రతి పాత్రను అద్భుతంగా మలిచి, రామ్ చరణ్‌ను మరింత ఉన్నత స్థాయిలో చూపించినందుకు అభినందనలు. మొత్తం ‘పెద్ది’ బృందానికి శుభాకాంక్షలు” అని రాశారు.
సినిమా విడుదలైన తర్వాత దానిపై స్పందించిన తొలి స్టార్ హీరోగా అల్లు అర్జున్ నిలిచారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు ఇతర ప్రముఖ నటులు ఈ చిత్రంపై బహిరంగంగా స్పందించలేదు.
ఇదిలా ఉంటే, ‘పెద్ది’ విడుదలైన నాటి నుంచి సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ముఖ్యంగా మహిళా పాత్రల ప్రదర్శనపై పలువురు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాన్వీ కపూర్ పాత్రను అవసరానికి మించి గ్లామర్ కోణంలో చూపించారని, మహిళలను చూపించిన తీరు అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా భారీ స్థాయిలో జరిగింది.
ఈ విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా ఇటీవల అధికారిక ప్రకటన విడుదల చేశారు. “సినిమా ప్రేక్షకులను అలరించాలి, ప్రేరేపించాలి, వారితో అనుబంధాన్ని పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ అసౌకర్యానికి గురిచేయకూడదు. ‘పెద్ది’లోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన అభిప్రాయాలను మేము గౌరవంగా స్వీకరించాం. మహిళల పట్ల నాకు ఎప్పుడూ అత్యంత గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రను అవమానించడం లేదా వస్తువుగా చూపించడం మా ఉద్దేశం కాదు. ప్రతి మహిళ గౌరవించబడాలి, విలువ పొందాలి. భవిష్యత్తులో కూడా బలమైన పాత్రలను, విలువలను ప్రతిబింబించే కథలనే చెప్పేందుకు మేము కట్టుబడి ఉంటాం” అని ఆయన స్పష్టం చేశారు.
ఒకవైపు వివాదాలు కొనసాగుతున్నా, మరోవైపు బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో నుంచి వచ్చిన ప్రశంసలు చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని అభిమానులు భావిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













