Last Updated:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమా ‘రాకా’. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ అంశాల కలయికతో ఈ సినిమా రూపొందుతుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమా ‘రాకా’. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ అంశాల కలయికతో ఈ సినిమా రూపొందుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ‘రాకా’ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.
ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. నటీనటుల హావభావాలు, శరీర కదలికలను అత్యంత సహజంగా రికార్డు చేసి వాటిని తెరపై ఆవిష్కరించేందుకు ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. హాలీవుడ్‌లో ‘అవతార్’ వంటి భారీ సినిమాల్లోనూ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించారు.
HISTORY MADE 🏆 A global triumph that takes Indian cinema to the world stage! 🌎#Raaka sets a Guinness World Record for the “Most People Motion-Captured in Real-Time”, with 37 performers captured simultaneously!
Mr. Allu Arjun and Mr. Atlee received the Guinness World Records… pic.twitter.com/BuozZNET6K
— Sun Pictures (@sunpictures) September 21, 2026
‘రాకా’ కోసం ఏకంగా 37 మంది నటీనటుల హావభావాలను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా రియల్‌టైమ్‌లో చిత్రీకరించారు. ఒకే ప్రాజెక్ట్‌లో ఇంతమంది నటీనటులను ఈ విధంగా రియల్‌టైమ్ మోషన్ క్యాప్చర్ చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు అందించిన సర్టిఫికెట్‌ను దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్‌కు అందజేశారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రాకా’ కథ మూడు విభిన్న కాలాల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. పురాణాలు, ఆధునిక కాలం అంశాలను మేళవిస్తూ ఈ కథను అట్లీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా కథ, విజువల్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
ఇక సినిమాలో అల్లు అర్జున్, దీపిక పదుకొణెతో పాటు పలువురు ప్రముఖ హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ ఓ గిరిజన యువతిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే రష్మిక మందన్న పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుందని, దీపిక పదుకొణె పాత్ర చేసే పోరాటానికి మార్గనిర్దేశం చేసే పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం.
మృణాల్ ఠాకూర్ కూడా ‘రాకా’లో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతో సినిమాలో ఈ నలుగురు కథానాయికల పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది.
సన్ పిక్చర్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ‘రాకా’ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. గిన్నిస్ రికార్డు, భారీ తారాగణం, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, మూడు కాలాల నేపథ్యం వంటి అంశాలతో ‘రాకా’పై అంచనాలు మరింత పెరిగాయి.














