CJP Protest: 35 వేల బలగాలు.. 20 జోన్లు.. డ్రోన్లు, బాడీ కెమెరాలతో పోలీసుల కట్టుదిట్టమైన పహారా! | | ACTPnews

PC: PTI


Last Updated:

CJP Protest: పోలీసుల అనుమతి నిరాకరణను తోసిరాజంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జంతర్ మంతర్ వద్ద శనివారం నిరసనకు పిలుపునివ్వడంతో దేశ రాజధాని ఢిల్లీ అష్టదిగ్బంధంలో చిక్కుకుంది.

PC: PTI
PC: PTI

‘జంతర్ మంతర్ 2.0’ పేరిట చేపట్టే ఈ నిరసనకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు రాజధాని అంతటా భారీ భద్రతా ఏర్పాట్లు అమలు చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆరోపణలు చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఈ ప్రక్రియను రద్దు చేసి నూతన నియామక విధానాన్ని తేవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే కన్నాట్ ప్లేస్ సమీపంలోని జనపథ్ వద్ద 200కు పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

35 వేల మంది బలగాలు.. 20 భద్రతా జోన్లు

అనుమతి లేని ఆందోళనలను అడ్డుకునేందుకు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 35 వేల మందికి పైగా ఢిల్లీ పోలీసులు, పారామిలట్రీ సిబ్బందిని మోహరించారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ కు చెందిన 120కి పైగా కంపెనీలు రంగంలోకి దిగాయి. కీలకమైన కూడళ్లు, రవాణా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పహారా ఏర్పాటు చేశారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం న్యూఢిల్లీ జిల్లాను 20 జోన్లుగా విభజించి జాయింట్ కమిషనర్లు, డీసీపీలు, అదనపు డీసీపీలకు బాధ్యతలు అప్పగించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుంచి అదనపు మహిళా పోలీసులను రప్పించారు. ఎక్కడైనా అనధికారికంగా నిరసనకు యత్నిస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాలని బలగాలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఘర్షణలను నివారించేందుకు సీఏపీఎఫ్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వకుండా, కేవలం లాఠీలు మాత్రమే కేటాయించారు.

ఆరు తాత్కాలిక నిర్బంధ కేంద్రాలు.. ముందస్తు అరెస్టులు

ఆందోళనకారులను తరలించేందుకు ఛత్రసాల్ స్టేడియం, రాజీవ్ గాంధీ స్టేడియం, యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్, సూరజ్ మల్ స్టేడియంతో పాటు దౌలత్‌పూర్, పాండ్రవాల్ కమ్యూనిటీ సెంటర్లతో సహా మొత్తం ఆరు తాత్కాలిక నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నేరచరిత్ర కలిగిన 30 నుంచి 40 మందిని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. జన సమీకరణకు యత్నిస్తున్న వారి ఇళ్ల వద్ద నిఘా పెంచి కదలికలను పరిశీలిస్తున్నారు.

బాడీ కెమెరాలు, డ్రోన్లు, ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలు

భద్రతా పర్యవేక్షణలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. సిబ్బంది యూనిఫామ్‌లకు చీకట్లోనూ దృశ్యాలను స్పష్టంగా రికార్డు చేయగల బాడీ కెమెరాలను అమర్చారు. పోలీసులపై ఆరోపణలు రాకుండా వాస్తవాలను నమోదు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయని అధికారులు స్పష్టం చేశారు. వీటితో పాటు ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలు, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో జన సమీకరణకు యత్నిస్తున్న 200 మందికి పైగా కంటెంట్ క్రియేటర్ల ఖాతాలపై సైబర్ విభాగం కన్నేసింది.

ట్రాఫిక్ ఆంక్షలు.. సరిహద్దుల్లో తనిఖీలు

శనివారం ఉదయం 6 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కన్నాట్ ప్లేస్, జంతర్ మంతర్, మండి హౌస్, పటేల్ చౌక్, అశోకా రోడ్డు, సంసద్ మార్గ్ మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. హోటళ్లు, లాడ్జీలు, ధర్మశాలలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్ల వద్ద అదనపు తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లేందుకు ప్రయాణ సమయాన్ని ముందే సరిచూసుకోవాలని పోలీసులు సూచించారు. మరోవైపు, ఇతర రాష్ట్రాల నుంచి నిరసనకారులు రాజధానికి రాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.

అనుమతి నిరాకరణకు కారణాలు

నిబంధనల ప్రకారం జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు 10 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, కేవలం మూడు రోజుల ముందే దరఖాస్తు చేశారని జాయింట్ సీపీ నూపూర్ ప్రసాద్ తెలిపారు. గతంలో నిబంధనల ఉల్లంఘనలు, ప్రజలకు కలిగే తీవ్ర అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిరసనకు అనుమతి నిరాకరించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ వేలాది మందితో జంతర్ మంతర్‌ను ముట్టడిస్తామని సీజేపీ పిలుపునివ్వడంతో ఢిల్లీ అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports