Last Updated:
నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యల నేపథ్యంగా మరో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రం ‘గుడ్ టైమ్’ అక్టోబర్ 9, 2026న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.
టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. భారీ బడ్జెట్, కమర్షియల్ హంగుల కంటే కూడా బలమైన కంటెంట్, సహజత్వానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న చిత్రాలకే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అద్దం పడుతూ, నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యల నేపథ్యంగా మరో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రం ‘గుడ్ టైమ్’ అక్టోబర్ 9, 2026న థియేటర్లలోకి వచ్చింది. నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని జంటగా చాణక్య జిల్లా దర్శకత్వంలో రమేష్ జిల్లా నిర్మించిన ఈ చిత్రం యువతను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కింది.
సాధారణంగా తెలంగాణ లేదా హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ అంటే పాతబస్తీ లేదా మురికివాడలను చూపిస్తుంటారు. కానీ ఈ చిత్రంలో దర్శకుడు తొలిసారిగా హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఆల్వాల్‌ను ఎంచుకుని రియలిస్టిక్ లొకేషన్లలో ఎక్కడా సెట్స్ వేయకుండా చిత్రీకరించారు. తండ్రి మరణంతో చదువు మధ్యలో ఆపేసిన జాని అలియాస్ జానకిరామ్ (నిఖిల్ గాజుల), క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. అదే ప్రాంతానికి చెందిన నిశ్చల (అన్యుక్త)తో ప్రేమలో పడతాడు. ఈజీ మనీకి అలవాటు పడి ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, లోన్ యాప్స్ ఉచ్చులో పడి అప్పుల పాలవుతాడు. ఒకవైపు అప్పుల వాళ్ల ఒత్తిడి, మరోవైపు ప్రియురాలి నుంచి ఎదురైన ఊహించని ట్విస్ట్ జాని జీవితాన్ని తలకిందులు చేస్తాయి. దీనికి తోడు తల్లి (సునీత) చేసిన ఒక దొంగతనం నేరం కూడా అతడి మెడకు చుట్టుకుంటుంది. ఈ కష్టాల వలయం నుంచి జాని ఎలా బయటపడ్డాడు, చివరకు అతడి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేది ఈ సినిమా కథ.
‘మై డియర్ దొంగ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ గాజుల.. హీరోగా తన తొలి చిత్రంలోనే ఎంతో పరిణితితో నటించాడు. అతడి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చూస్తే సిద్దు జొన్నలగడ్డ గుర్తుకువస్తాడు. హీరోయిన్ అన్యుక్త తన గ్లామర్, నటనతో మెప్పించింది. దర్శకుడు చాణక్య జిల్లా తన స్వీయ అనుభవాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఫస్ట్ హాఫ్ రేసీగా సాగుతూనే, ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ‘బేబి’ సినిమాను గుర్తుచేస్తుంది. సెకండాఫ్, క్లైమాక్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెడతాయి. అభిరామ్ రాయప్రోలు మాటలు, నిర్వాణ్ ఆత్రేయ సంగీతం, ప్రత్యేకంగా ‘దావత్’ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను హుషారెత్తిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అన్వేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నప్పటికీ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేకపోయినా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ (A) సర్టిఫికెట్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను ఆదరించే ప్రస్తుత ట్రెండ్‌లో, ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా రెండున్నర గంటల పాటు వినోదాన్ని పంచడంలో ఈ ‘గుడ్ టైమ్’ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.
రేటింగ్ : 2.75














