Last Updated:
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాక్రోచ్ జనతా పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, పీటీఐ కార్యాలయం సమీపంలో రాళ్లదాడి జరగడం కలకలం రేపాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సభ్యులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే ఆందోళనలు మరింత వేడెక్కాయి. కనాట్ ప్లేస్ ప్రాంతంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) కార్యాలయం సమీపంలో రాళ్లదాడి ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ పోలీసు సిబ్బంది గాయపడినట్లు సమాచారం. మరోవైపు, పార్టీ అగ్రనేతలు నిర్బంధంలో ఉండటంతో నిరసనలకు నాయకత్వం వహించే బాధ్యతను సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి అజింక్య శిందేకు అప్పగించినట్లు వెల్లడైంది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అదుపులోకి తీసుకున్న అనంతరం అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించినట్లు సీజేపీ ఎక్స్ వేదికగా తెలిపింది. నిర్బంధంలో ఉన్న తమ నాయకులకు న్యాయవాదులను కలిసే అవకాశం ఇవ్వడం లేదని, ఇతరులతో సంప్రదింపులు జరపకుండా అడ్డుకుంటున్నారని పార్టీ ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండా ఎందుకు ఉన్నారంటూ తన పోస్టులో ప్రశ్నించింది.
నిరసనల దృష్ట్యా ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. రాజధానిలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేస్తూ, వాటిపై నిఘా కొనసాగిస్తున్నారు. హోటళ్లు, అతిథి గృహాలు, వసతి గృహాలు, ధర్మశాలల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. బస్సు టెర్మినళ్లు, ఇతర రవాణా కేంద్రాల వద్ద కూడా అప్రమత్తత పెంచారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ముమ్మరం చేయడంతో పాటు, నిరసనల కోసం జన సమీకరణకు సంబంధించి 200 మందికి పైగా కంటెంట్ సృష్టికర్తలను విచారణ పరిధిలోకి తీసుకున్నట్లు సమాచారం. ముందస్తు జాగ్రత్తగా శనివారం ఢిల్లీ అంతటా మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై సీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో జాబితాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని, ఓటరు నమోదు పత్రం ఫారం-6లో మార్పులపై ఇద్దరు సహాయ ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పక్కనపెట్టారని ఆరోపిస్తోంది. ఈ అంశాలపై ప్రశ్నించేందుకే నిరసనలు చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు, ఆంక్షలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. నగరంలో ప్రతి కొన్ని వందల మీటర్లకో తనిఖీ కేంద్రం, కాంక్రీట్ బారికేడ్లు, రోడ్లపై ముళ్ల అడ్డంకులు కనిపిస్తున్నాయని ఎక్స్‌లో పేర్కొన్నారు. సుమారు 22 వేల మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని మోహరించారని, 250 రైళ్లు రద్దయ్యాయని, 45 మెట్రో స్టేషన్లు మూసివేశారని ఆయన ఆరోపించారు. యువకులను ఇళ్ల నుంచి, వీధుల నుంచి అదుపులోకి తీసుకుంటున్నారనే వార్తలను కూడా ప్రస్తావించారు. రాజధాని నడిబొడ్డున ఇంటర్నెట్ నిలిపివేయడం, జంతర్ మంతర్‌కు వెళ్లే మార్గాలను మూసివేయడం ప్రజల స్వేచ్ఛను పరిమితం చేయడమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంపై ప్రజలకు ఉన్న సందేహాలకు సమాధానాలు ఇవ్వడం ద్వారానే ప్రశాంతతను పునరుద్ధరించవచ్చని అన్నారు.
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని బట్టి రాకపోకల నియంత్రణ చర్యలను అమలు చేయడం లేదా సడలించడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలు, తాజా ట్రాఫిక్ సమాచారం కోసం అధికారిక వేదికలను పరిశీలించాలని ప్రయాణికులకు సూచించారు.














