Iran-US Deal: అమెరికా శాంతి ఒప్పందంలో సరికొత్త ట్విస్ట్.. ఇరాన్‌లో చెలరేగిన నిరసనలు.. విదేశాంగ మంత్రి రాజీనామాకు డిమాండ్! | | ACTPnews

ఇరాన్‌లో నిరసనలు


Last Updated:

ఈ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్‌లను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

ఇరాన్‌లో నిరసనలు
ఇరాన్‌లో నిరసనలు

Iran-US Deal: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణానికి ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్న శాంతి ఒప్పందం (Peace Agreement) ఇరాన్ లోపల తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీస్తోంది. అమెరికాతో ప్రతిపాదిత శాంతి ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇరాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో శనివారం రాత్రి కఠిన అల్ట్రా-కన్జర్వేటివ్ (హార్డ్‌లైనర్) నిరసనకారులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఈ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్‌లను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ అధికారులు ఆదివారమే (జూన్ 14) ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు జరగవచ్చని ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్‌లో ఈ ఆందోళనలు చెలరేగడం గమనార్హం.

విదేశాంగ మంత్రి కార్యాలయం ముట్టడి

అంతర్జాతీయ వార్తా సంస్థ ‘AFP’ కథనం ప్రకారం.. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రతిపాదిత ఒప్పంద వివరాలను వెల్లడించిన వెంటనే, ఈశాన్య నగరమైన మషద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం వెలుపల వందలాది మంది నిరసనకారులు గుమిగూడారు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఫార్స్’ (Fars) విడుదల చేసిన వీడియోలలో.. నల్లటి చాదర్లు ధరించిన మహిళలు ఎరుపు, నలుపు జెండాలు ఊపుతూ విదేశాంగ మంత్రికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు.

“అమెరికాకు లొంగిపోయిన అవమానకరమైన అరాగ్చీ నశించాలి”, “అరాగ్చీ సిగ్గు తెచ్చుకో.. దేశాన్ని శత్రువుల చేతుల్లో పెట్టడం ఆపు”, “దేశంలోకి చొరబడిన దేశద్రోహి అరాగ్చీకి మరణం తప్పదు” అంటూ నిరసనకారులు హోరెత్తించారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ “సంధి కుదుర్చుకున్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలి” అంటూ డిమాండ్ చేసినట్లు ‘రాయిటర్స్’ (Reuters) వార్తా సంస్థ వెల్లడించింది.

ఇరాన్ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు

అమెరికాతో కుదుర్చుకుంటున్న ఈ ఒప్పందం వల్ల ఇరాన్ జాతీయ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హార్డ్‌లైనర్ నాయకులు వాదిస్తున్నారు. అత్యంత వ్యూహాత్మకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (హార్ముజ్ జలసంధి)పై ఇరాన్‌కు ఉన్న పట్టును ఈ ఒప్పందం బలహీనపరుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. వాషింగ్టన్‌తో డీల్ ఓకే చేసుకోవడం కోసం ఇరాన్ చర్చల ప్రతినిధులు అమెరికాకు మరీ ఎక్కువ లొంగిపోయారని విమర్శిస్తున్నారు.

శుక్రవారం ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాగ్చీ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నౌకాదళ ముట్టడి (Naval Blockade) తొలగిపోతుందని చెప్పారు. అయితే అదే సమయంలో, “హార్ముజ్ జలసంధి నిర్వహణ ఇకపై మునుపటిలా ఉండబోదు” అని ఆయన వ్యాఖ్యానించడం నిరసనకారులను మరింత రెచ్చగొట్టింది. ఎందుకంటే ఇరాన్ ఈ జలమార్గాన్ని అమెరికాను అడ్డుకునే ప్రధాన ఆయుధంగా భావిస్తుంది.

ఒప్పందంపై సందిగ్ధత

ఒప్పందంపై ఆదివారమే సంతకాలు జరుగుతాయని ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నొక్కిచెబుతున్నప్పటికీ.. దేశంలో వస్తున్న అంతర్గత నిరసనల నేపథ్యంలో టెహ్రాన్ అధికారిక యంత్రాంగం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పందిస్తూ.. “సంతకాల ప్రక్రియ రేపే (ఆదివారం) జరగదు, దానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు” అని ప్రకటించారు.

ఒప్పందంలో ఏముంది

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ ప్రతిపాదిత అవగాహన ఒప్పందం (MoU) ప్రధానంగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్‌పై అమెరికా నౌకాదళ ముట్టడిని ఎత్తివేయడంపైనే కేంద్రీకృతమైంది. దీనికి బదులుగా, అంతర్జాతీయంగా స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులను విడుదల చేయడానికి మరియు ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షల సడలింపుకు అమెరికా అంగీకరించినట్లు ముసాయిదా పత్రాలు చెబుతున్నాయి. కాగా, అత్యంత వివాదాస్పదమైన ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను తదుపరి 60 రోజుల ప్రత్యేక ప్రక్రియలో చేపట్టాలని నిర్ణయించారు. అయితే సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఇరాన్ ప్రభుత్వం ఈ ఒప్పందంపై ముందడుగు వేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports