నేడు న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ కార్యక్రమాలు:
ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీకి న్యూజిలాండ్ ప్రభుత్వం, అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు తమ సాంప్రదాయ ‘మావోరీ’ పద్ధతిలో “క్యా ఓరా మోదీ” (Kia Ora Modi) అంటూ సాదరంగా ఆహ్వానం పలికారు. జులై 10, 11 తేదీల్లో జరిగే ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌తో మోదీ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 2025 మార్చిలో క్రిస్టోఫర్ లక్సన్ భారతదేశంలో పర్యటించిన తర్వాత ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని ఈ చర్చలు మరింత ముందుకు తీసుకువెళతాయని విదేశాంగ శాఖ స్టేట్‌మెంట్ తెలిపింది.
ఈ సంవత్సరం ఏప్రిల్ 2026లో రెండు దేశాల మధ్యా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement – FTA) కుదరడంతో.. తాజా చర్చలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్ నుంచి వచ్చే వస్తువులపై 95 శాతం టారిఫ్ లను భారత్ తొలగిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర జలాల భద్రత, రక్షణ రంగం, పర్యాటకం, విద్యా సంబంధాలు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై ఇద్దరు నేతలు లోతైన చర్చలు జరపనున్నారు. దీంతో పాటు ఆక్లాండ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలు, క్రీడాకారులతో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే, భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోదీ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. న్యూజిలాండ్ అభివృద్ధిలో ఇండో-కివీల పాత్రను, వారి నైపుణ్యాలను ఆయన ఈ సందర్భంగా కొనియాడనున్నారు.
నిన్న (జులై 9) ఆస్ట్రేలియాలో ప్రధాని పర్యటన విశేషాలు:
ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన అత్యంత విజయవంతంగా, వ్యూహాత్మకంగా సాగింది. జులై 9న మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్‌తో కలిసి మూడవ ‘ఇండియా-ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సు’లో (Annual Leaders’ Summit) మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో రెండు దేశాలూ నూతన ‘డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్’పై ఒక చారిత్రాత్మక ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించాయి. దీని ద్వారా రెండు దేశాల సాయుధ దళాల మధ్యా సైనిక సహకారం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యం పెంపొందించడం, భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను పటిష్టం చేయడం వంటి లక్ష్యాలు అమలవుతాయి.
ఆ తర్వాత ‘ఆస్ట్రేలియా-ఇండియా సీఈఓ ఫోరమ్’ సమావేశంలో పాల్గొన్న ప్రధాని.. ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలను భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనీ, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాలలో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని (CECA) త్వరగా ఖరారు చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారని ది హిందూ రిపోర్ట్ చేసింది. అంతేకాకుండా, పశ్చిమాసియాలో ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించాలని రెండు దేశాల ప్రధానులూ సంయుక్తంగా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులతో పాటు విక్టోరియా గవర్నర్ మార్గరెట్ గార్డ్నర్, ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ సామ్ మోస్టిన్, ప్రతిపక్ష నేత అంగస్ టేలర్ తదితరులతో మోదీ అత్యంత కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఈవెంట్‌లో పాల్గొని ప్రసంగించి, భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటారు.
ఈరోజు (జులై 10) ఉదయం ఆక్లాండ్ బయలుదేరే ముందు, మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో కలిసి చారిత్రాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) ని సందర్శించారు. అక్కడ ‘ఇండియా-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్’ ను విడుదల చేశారు. కబడ్డీ, క్రికెట్ క్రీడాకారులతో పాటు ఆస్ట్రేలియా క్రీడా దిగ్గజాలు స్టీవ్ వా, లీసా స్థాలేకర్ లతో మోదీ ముచ్చటించారు. 2030లో భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్, 2032లో ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరగనున్న తరుణంలో ఈ రోడ్‌మ్యాప్ స్పోర్ట్స్ రంగంలో రెండు దేశాలకూ ఎంతో ఉపయోగపడుతుందని మోదీ స్పష్టం చేశారు.













