Last Updated:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజీ’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ ౩న రిలీజ్ కావాల్సి ఉండగా, వాయిదా పడినట్లు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి టైటిల్‌గా ‘ఫౌజీ’ ఫిక్స్ చేశారు.
తాజాగా ఈ సినిమా విడుదలపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ అధికారికంగా స్పందించారు. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, షూటింగ్, భారీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా ఈ సినిమా వాయిదా పడుతుందని గత కొద్ది రోజులుగా సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రవిశంకర్, ‘ఫౌజీ’ రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుందని స్పష్టం చేశారు.
అనుకున్న సమయానికంటే సినిమా కొద్దిగా లేటుగా వచ్చినప్పటికీ, కంటెంట్ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభాస్ కెరీర్ లో ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమా ఇదే అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీంతో సినిమా వాయిదా పడిందని ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనప్పటికీ, సినిమా రేంజ్ పై నిర్మాత చేసిన వ్యాఖ్యలతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు.
‘సీతా రామం’ వంటి బ్లాక్ బస్టర్ క్లాసిక్ తర్వాత హను రాఘవపూడి ఈ సినిమాను స్వాతంత్య్రానికి పూర్వం, 1940ల నాటి సెటప్ లో తెరకెక్కిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) నేపథ్యంతో ఈ కథ నడుస్తుందని సమాచారం. ఇందులో ప్రభాస్ దేశం కోసం పోరాడే ఒక పవర్ ఫుల్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, డ్యాన్సర్ ఇమాన్వి హీరోయిన్ గా వెండితెరకు పరిచయమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి సీనియర్ నటీనటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఎమోషనల్ లవ్ స్టోరీ కలగలిపిన ఈ పీరియాడిక్ వార్ డ్రామా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.














