Last Updated:
టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత టాలీవుడ్లో మహిళల భద్రతపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సినీ పరిశ్రమలో మహిళల భద్రత, క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) వంటి అంశాలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేదా చర్చ జరుగుతూనే ఉంటుంది. మీటూ (MeToo) ఆరోపణలు, హేమ కమిటీ నివేదికలతో పలు ఇండస్ట్రీలు కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత టాలీవుడ్లో మహిళల భద్రతపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత, సినిమా ఇండస్ట్రీ మహిళలకు ఏమాత్రం సురక్షితమైన ప్రదేశం కాదని కుండబద్దలు కొట్టారు. తాను పరిశ్రమలో ఎంతో కాలంగా కొనసాగుతూ, అత్యంత విజయవంతమైన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈ కఠినమైన నిజాన్ని నిజాయితీగా చెబుతున్నానని ఆమె స్పష్టం చేశారు. “ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో, నాకు కేవలం 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కొన్ని చేదు అనుభవాలు, అసౌకర్యకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ మీడియా ముందుకు వచ్చి ఫలానా వాళ్లు నాతో ఇలా ప్రవర్తించారు అని పదే పదే చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది కేవలం నా ఒక్కరి సమస్య కాదు, పరిశ్రమలో ఎంతో మంది మహిళలు రోజూ ఎదుర్కొంటున్న దుస్థితి. దీనిపై ఎంత చర్చించినా ఒక ముగింపు అనేది ఉండదు” అని సునీత తన ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలో కొందరి ప్రవర్తన గురించి వివరిస్తూ.. మనుషుల ద్వంద్వ వైఖరిని ఆమె ఎండగట్టారు. “ఒక వ్యక్తి ఒకరి దగ్గర అత్యంత మర్యాదగా, విద్యావంతుడైన పెద్దమనిషిలా ప్రవర్తించవచ్చు. కానీ, అదే వ్యక్తి మరో మహిళ దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించవచ్చు. ఇక్కడ ఎవరి అసలు రంగు ఎలాంటిదో ముందుగా పసిగట్టడం చాలా కష్టం” అని వ్యాఖ్యానించారు. అవకాశాల పేరుతో మహిళలను దోపిడీ చేసే సంస్కృతి ఇంకా బతికే ఉందన్న ఉద్దేశాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు.
ఇక ఫెమినిజం, మహిళల స్వేచ్ఛ గురించి సునీత తనదైన శైలిలో విభిన్నమైన కోణంలో స్పందించారు. “మహిళలు ‘మై బాడీ.. మై రైట్’ (నా శరీరం, నా ఇష్టం) అని స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. కానీ సమాజంలో దానికి కౌంటర్‌గా ‘హిస్ ఐస్.. హిస్ రైట్’ (అతని కళ్లు, అతని ఇష్టం) అనే మరో కోణం కూడా దాగి ఉంది. అసలు ఫెమినిజం అంటే ఏమిటి? దాని పరిధి ఎంత? అనే విషయాలపై మరింత లోతైన చర్చ జరగాల్సి ఉంది. సృష్టిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ పూర్తిగా ఒకేలా ఉండరు. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం అనే అంశాలను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు” అని సునీత అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సునీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ధైర్యంగా వాస్తవాలు మాట్లాడారని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుండగా, ఫెమినిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలతో మరికొందరు విభేదిస్తున్నారు. ఏది ఏమైనా సునీత లాంటి సీనియర్ సింగర్ చేసిన ఈ కామెంట్స్‌తో టాలీవుడ్లో మహిళల రక్షణ కోసం పటిష్టమైన చర్యలు, కమిటీలు (POSH/ICC) ఉండాలనే డిమాండ్‌కు మరోసారి బలం చేకూరినట్లయింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













