Last Updated:
సినీ రంగంలో టైటిల్ వివాదాలు కొత్తేమీ కాకపోయినప్పటికీ, ఓ సామాన్య రైతు కుటుంబం కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి దాచుకున్న సొమ్ముతో తీసిన సినిమా వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సినీ రంగంలో టైటిల్ వివాదాలు కొత్తేమీ కాకపోయినప్పటికీ, ఓ సామాన్య రైతు కుటుంబం కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి దాచుకున్న సొమ్ముతో తీసిన సినిమా వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ (Spirit). అయితే, ఇదే పేరుతో (స్పిరిట్ ఈజ్ నాట్ వన్) ఒక చిన్న చిత్రాన్ని నిర్మించి, ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఒక వ్యవసాయ కూలీ కుటుంబం.. తమను ప్రభాస్ ఆదుకోగలరంటూ కన్నీటి పర్యంతమవుతోంది.
‘8th వండర్ సినిమాస్’ బ్యానర్‌పై నర్సమ్మ అనే మహిళా రైతు తన భర్తతో కలిసి ఎంతో కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ అనే సినిమాను నిర్మించారు. ఇందుకోసం తమకున్న ఆస్తులను సైతం అమ్ముకుని సర్వస్వం కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే.. దాదాపు ఏడాది క్రితమే తమ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ కూడా లభించిందని వారు పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానెల్స్, మీడియా వేదికల ద్వారా ప్రమోషన్లు పూర్తి చేసుకుని, పోస్టర్లు ముద్రించి, గత నెలలో సినిమాను విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
సరిగ్గా విడుదల సమయానికి, ‘స్పిరిట్’ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘టీ-సిరీస్’ అధినేత భూషణ్ కుమార్ తరఫున వీరికి రెండు లీగల్ నోటీసులు అందాయి. సందీప్ రెడ్డి వంగా మేనేజర్ ద్వారా తమ వివరాలు సేకరించి, సినిమా విడుదలను, ప్రచార కార్యక్రమాలను నిలిపివేయాలంటూ కోర్టు కేసు వేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా తమను రోడ్డున పడేశారని నిర్మాత నర్సమ్మ కన్నీరు పెట్టుకున్నారు. కోర్టు కేసుల వల్ల విడుదలకు ఆర్థిక సహాయం అందిస్తామన్న వారు కూడా వెనకడుగు వేయడంతో ఊరిలో పరువు పోయిందని, ఎవరూ నమ్మడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఇండస్ట్రీ నుండి ఎలాంటి మద్దతు లభించడం లేదని, ఈ క్లిష్ట సమయంలో హీరో ప్రభాస్ మాత్రమే పెద్ద మనసుతో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. “ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగా గారంటే మాకు ఎంతో అభిమానం. మాతో నేరుగా మాట్లాడి ఉంటే ప్రభాస్ గారి కోసం మా సినిమా టైటిల్ మార్చుకోవడానికి మేము ఎప్పుడో సిద్ధంగా ఉండేవాళ్ళం. లీగల్ నోటీసులతో మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడం తగదు” అని వారు కోరుతున్నారు. సినిమా విడుదలకు ప్రభాస్ సహాయం అందించి, ఒక రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. మరి ఈ వివాదంపై ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా లేదా భూషణ్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













