ఖైరతాబాద్ బడా గణేశుడు ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో భక్తులకు దర్శనమిచ్చి, హుస్సేన్‌సాగర్‌లో ఘనంగా నిమజ్జనమయ్యారు. శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది. అక్కడ ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం భారీ క్రేన్ల సాయంతో మధ్యాహ్నం 2.15 గంటలకు నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయింది.
బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈసారి రికార్డు స్థాయిలో రూ.39 లక్షలకు వేలంలో అమ్ముడైంది. వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్‌రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. వేలంలో మొత్తం 8 మంది పాల్గొనగా, చివరకు లడ్డూ సామ ప్రణీత్‌రెడ్డికి దక్కింది. బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలానికి అధిక ధర పలకడంలో 45 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. గత ఏడాది లడ్డూ రూ.35 లక్షలు పలకగా, ఈసారి స్వామివారి 21 కిలోల లడ్డూ వేలంలో కొత్త రికార్డు నమోదైంది.
ముంబైలో ప్రసిద్ధ లాల్‌బాగ్ చా రాజా నిమజ్జన శోభాయాత్రకు లక్షలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. అనంత చతుర్దశి సందర్భంగా ప్రారంభమైన శోభాయాత్ర భక్తుల జయజయధ్వానాలు, భజనలు, డప్పుల మోతల మధ్య వైభవంగా కొనసాగింది. భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ గిర్గావ్ చౌపట్టీ వైపు రాజా ఊరేగింపు సాగుతుండగా భక్తులు పెద్దఎత్తున వీడ్కోలు పలికారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బారికేడ్లు దాటి ఎన్నికల కమిషన్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని నిర్బంధించారు.ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని దేవేందర్ యాదవ్ అన్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. ఇదే తరహా ఆందోళనలు కోల్‌కతా, జమ్మూ సహా పలు నగరాల్లో కొనసాగాయి.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. రేపటిలోగా రాజీనామా చేయకపోతే అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రకటించింది. పార్టీ నేత అభిజీత్ దీప్కే ముంబైలో ఉద్యమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ఈ హెచ్చరికతో రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది.
మరికొన్ని గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయి. ఏపీలో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలో 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించి, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నటుడు సంపూర్ణేష్ బాబు వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ వీడియోపై స్పందిస్తూ, జర్నలిస్టు నాగేంద్రతో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని తెలిపారు. ఇంటర్వ్యూలో ఫ్లోలో ఒక మాట దొర్లిందని, దాన్ని తాను తప్పుగా తీసుకోలేదన్నారు. హృదయకాలేయం సినిమా నుంచి అభిమానులు తనకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. తనను ఇష్టపడేవారు ఈ వ్యాఖ్యలను వివాదంగా చూడవద్దని సంపూర్ణేష్ బాబు విజ్ఞప్తి చేశారు.
మూడు రోజుల నిరీక్షణ తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ రెండో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సురుచి సింగ్, కమల్‌జీత్ టీం అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం గెలిచింది.మహిళల క్రికెట్‌లో గోల్డ్ తర్వాత షూటింగ్‌లో భారత్‌కు ఇది మరో స్వర్ణం. ఈ విజయంతో భారత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాల సంఖ్య రెండుకు చేరింది.
అమెరికా ఇరాన్‌పై చర్యల్లో భాగంగా అత్యాధునిక **లేజర్ ఆయుధాలను వినియోగిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. హర్మూజ్ ప్రాంతంలో డ్రోన్లు, క్రూజ్ క్షిపణులను ఈ సాంకేతికతతో సమర్థంగా కూల్చుతున్నట్లు సమాచారం. ఈ లేజర్ వ్యవస్థల నిర్వహణకు మార్పులు చేసిన ఎక్స్‌బాక్స్ కంట్రోలర్లను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై అమెరికా సుమారు 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, ఇరాన్-అమెరికా యుద్ధం ఎప్పుడు ముగియాలనేది అమెరికా నిర్ణయించాల్సిన విషయమని అన్నారు. యుద్ధాన్ని కొనసాగించాలని తమకు లేదని, కానీ దానిని ముగించే విషయంలో ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేదని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలు ఒత్తిడి తెచ్చినా ఇరాన్ లొంగబోదని స్పష్టం చేశారు. ఈ సంఘర్షణ ఇరాన్‌కైనా, అమెరికాకైనా ప్రయోజనకరం కాదని పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు.













