FIFA World Cup 2026: ఫీఫా ప్రపంచ కప్ 2026ను ఫ్రీ గా ఎలా చూడాలి?ఫుట్‌బాల్ అభిమానులకు పండగే.. | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసార హక్కులను జీ ఎంటర్‌టైన్‌మెంట్ సొంతం చేసుకుంది. యునైట్8 స్పోర్ట్స్ ఛానళ్లు, జీ5 ఓటీటీ ద్వారా అన్ని ప్రధాన మ్యాచ్‌లు ప్రసారం కానుండగా, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ సహా కొన్ని కీలక మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్ ఉచితంగా టెలికాస్ట్ చేయనుంది. ఫుట్‌బాల్ అభిమానులకు టీవీ, డిజిటల్, ఫ్రీ-టు-ఎయిర్ వేదికల్లో వీక్షణ అవకాశం లభించనుంది.

News18
News18

ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా టోర్నమెంట్‌లలో ఒకటైన ఈ మెగా ఈవెంట్‌ను భారత్‌లో ఎక్కడ వీక్షించాలనే సందిగ్ధతకు ఇప్పుడు తెరపడింది. టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే భారతీయ ప్రసార హక్కులపై స్పష్టత రావడంతో ఫుట్‌బాల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్ 2026ను భారత్‌లో ప్రసారం చేసే హక్కులను జీ ఎంటర్‌టైన్‌మెంట్ సొంతం చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు టెలివిజన్‌తో పాటు డిజిటల్ వేదికల ద్వారా కూడా మ్యాచ్‌లను వీక్షించే అవకాశం పొందనున్నారు. టోర్నమెంట్ ప్రసార భాగస్వామిపై నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి ఈ నిర్ణయంతో ముగింపు లభించింది.

ఈ ఒప్పందం కేవలం వరల్డ్ కప్‌కే పరిమితం కాకుండా ఫిఫాతో జీ సంస్థ కుదుర్చుకున్న దీర్ఘకాల భాగస్వామ్యంలో భాగంగా ఉంది. ఈ ఒప్పందం ప్రకారం 2034 వరకు నిర్వహించనున్న మరో 38 ఫిఫా టోర్నమెంట్‌ల ప్రసార హక్కులను కూడా జీ సంస్థ పొందినట్లు సమాచారం. దీంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రసారాల్లో జీ తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంది.

తమ క్రీడా ప్రసార విభాగాన్ని విస్తరించే క్రమంలో జీ సంస్థ కొత్తగా నాలుగు ప్రత్యేక స్పోర్ట్స్ ఛానళ్లను ప్రారంభించింది. యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్‌డీ ఛానళ్ల ద్వారా వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. టెలివిజన్ ప్రేక్షకులతో పాటు డిజిటల్ వీక్షకులను దృష్టిలో ఉంచుకుని జీ5 ఓటీటీ వేదికలో కూడా అన్ని ప్రధాన మ్యాచ్‌లను అందుబాటులో ఉంచుతోంది.

స్ట్రీమింగ్ సేవలను వినియోగించాలనుకునే వారికి జీ5 రెండు సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలను అందిస్తోంది. మూడు నెలల ప్లాన్ ధర రూ.799 కాగా, వార్షిక ప్లాన్ రూ.1,699గా నిర్ణయించింది. దీంతో మొబైల్, టాబ్లెట్, స్మార్ట్ టీవీ వంటి పరికరాల ద్వారా కూడా అభిమానులు మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

అయితే చెల్లింపు సేవలు అందుబాటులో లేని ప్రేక్షకులకు కూడా వరల్డ్ కప్ ఉత్కంఠను ఆస్వాదించే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రసార సంస్థ డీడీ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లోని కొన్ని కీలక మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ప్రారంభ మ్యాచ్‌తో పాటు నాకౌట్ దశలోని ముఖ్య పోటీలను కూడా డీడీ స్పోర్ట్స్‌లో వీక్షించవచ్చు.

టోర్నమెంట్ ప్రారంభ పోరుగా మెక్సికో-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్ ప్రసారం చేయనుంది. భారత కాలమానం ప్రకారం జూన్ 12 అర్ధరాత్రి 12:30 గంటలకు ఈ మ్యాచ్ టెలికాస్ట్ కానుంది. అలాగే జూలై 9, 10, 11 తేదీల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్, జూలై 14, 15 తేదీల్లో జరిగే రెండు సెమీఫైనల్స్‌ను కూడా డీడీ ఫ్రీ డిష్ వినియోగదారులు ఉచితంగా వీక్షించగలరు.

ఇక టోర్నమెంట్‌లో అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్‌ను కూడా డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. జూలై 19న జరగనున్న ఫైనల్ పోరును దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉచితంగా వీక్షించే అవకాశం పొందనున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports