Last Updated:
నెట్టింట ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోండి.
సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం పిచ్చి వేషాలు వేస్తే కటకటాలు లెక్కబెట్టాల్సిందే.. ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపై స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నడిరోడ్డుపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఓ జెప్టో డెలివరీ బాయ్‌ని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో అతడు పోస్ట్ చేసిన వీడియోల ఆధారంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడిని 19 ఏళ్ల షాదాబ్ గా గుర్తించారు. నిందితుడు ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ జెప్టోలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. వృత్తిని పక్కనపెట్టి నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన కేబీఆర్ పార్క్ మెయిన్ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన రీతిలో స్టంట్స్ చేశాడు. అలాగే నగర శివార్లలోని శామీర్‌పేట రోడ్లపై కూడా తోటి వాహనదారులకు తీవ్ర భయాందోళనలు గురిచేస్తూ పిచ్చి స్టంట్స్ తో రెచ్చిపోయాడు.
ప్రధాన రోడ్లపై ఇష్టానుసారంగా స్కూటర్ నడుపుతూ చేసిన స్టంట్స్ మొత్తాన్ని స్నేహితులతో వీడియోలు తీయించాడు. ఆ తర్వాత వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వ్యూస్ కోసం పెట్టిన ఈ వీడియోలు కాస్తా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లాయి. వెంటనే రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించేలా ప్రవర్తించినందుకు నూతన చట్టం భారతీయ న్యాయ సంహిత (BNS), మోటార్ వాహనాల చట్టం కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా ఈ ప్రమాదకరమైన స్టంట్స్ కోసం ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను పోలీసులు వెంటనే సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, పాదచారులకు ప్రాణహాని కలిగించేలా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పబ్లిక్ రోడ్లను రేసింగ్ ట్రాక్‌లుగా మార్చుకుని సామాన్యులను భయబ్రాంతులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
కేవలం సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించాలనే ఆలోచనతో ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు షేర్ చేసే యువతపై ప్రత్యేక నిఘా పెట్టామని పోలీస్ అధికారులు తేల్చి చెప్పారు. పబ్లిక్ లో భయాందోళనలు సృష్టించే ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడే యువకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఇకముందు కూడా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు పునరుద్ఘాటించారు.
Hyderabad,Hyderabad,Telangana













