Last Updated:
Tirumala Temple: తిరుమలలో వేసవి సెలవుల వల్ల భారీ రద్దీ, టీటీడీ క్యూలైన్లు తాత్కాలికంగా నిలిపి, ఉచిత బస్సులు, అన్నప్రసాదం, పాలు, మజ్జిగతో భక్తుల సేవలు బలోపేతం చేసింది
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు, వేసవి సెలవుల సీజన్ కావటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శనివారం ఉదయం నుంచి కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. కంపార్టుమెంట్ నుంచి భక్తులను దర్శనానికి పంపించిన కొద్దిపాట్లతోనే మళ్లీ కంపార్టుమెంట్లు నిండిపోతున్నాయి.
శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులను క్యూలైన్లలోకి ప్రవేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం ఉదయం 6 గంటల తర్వాతే భక్తులు క్యూలైన్లలోకి అనుమతించారు.
మరోవైపు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూలైన్లను తాత్కాలికంగా మూసివేయటం ఈ నెలలో ఇది రెండోసారి. మే 20వ తేదీన భక్తుల రద్దీ ఎక్కువ కావటంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 వరకూ భక్తులను క్యూలైన్లలోకి అనుమతించటం తాత్కాలికంగా నిలిపివేశారు. రాత్రి 8 తర్వాతే తిరిగి అనుమతి ఇచ్చారు. తాజాగా శనివారం మధ్యాహ్నం మరోసారి ఈ తరహా పరిస్థితి నెలకొంది.
మరోవైపు వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ పెరుగుతుందనే అంచనాతో టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలోని భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. భక్తుల రద్దీని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది. జిల్లా అధికారులు, పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్, ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. క్యూలైన్లలో భక్తుల తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు.
భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో 320కు పైగా ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నామని, భక్తుల రద్దీ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ సహకారంతో అదనంగా మరో వందకు పైగా ట్రిప్పులు నడుపుతామని తెలిపారు. రోజూ నాలుగు లక్షల మందికి భక్తులకు సరిపడా అన్నప్రసాదాలను సిద్ధం చేస్తున్నామని.. 45 వేల లీటర్ల మజ్జిగ, 50 వేల లీటర్ల పాలు అందిస్తున్నామని చెప్పారు. అన్ని విభాగాలు 24 గంటలు పనిచేస్తున్నాయని.. అదనపు శ్రీవారి సేవకులను నియమించి భక్తులకు సేవలను విస్తరించామని తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం అన్నమాచార్య కీర్తనలు, శ్రీవారి మహత్యాన్ని నిరంతరం ప్రసారం చేస్తున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













