Last Updated:
Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని బహదూర్‌గూడలో ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసులపై దాడులకు తెగబడిన ఆందోళనకారులపై శంషాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రముఖ రాజకీయ నేతలు పటోళ్ల కార్తీక్ రెడ్డి, పంతంగి భూపాల్‌రెడ్డి, మహేందర్, కోలన్ ప్రదీప్‌రెడ్డి సహా మొత్తం 36 మందిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు, ఉద్రిక్తతల నడుమే మొత్తం 650 ఎకరాల ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.
బుల్లెట్ రైలు, ఆర్టీసీ బస్సు ప్రాజెక్టుల కోసం విమానాశ్రయానికి, ఓఆర్ఆర్ (ORR)కు మధ్య సర్వే నంబర్ 62లోని 500 ఎకరాలు, సర్వే నంబర్ 28లోని 150 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న స్థానిక రైతులు.. తమకు న్యాయం చేయాలంటూ గత 8 రోజులుగా అక్కడే దీక్ష చేపట్టారు.
రైతులు కంచె నిర్మాణాన్ని అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో ‘హైడ్రా’ (HYDRAA) అధికారులు శనివారం వేకువజామునే భారీ పోలీసు బందోబస్తుతో రంగప్రవేశం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని తొలగించి, ఆ భూములకు ఫెన్సింగ్ వేయడం ప్రారంభించారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు, మహిళలతో పాటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి హైడ్రా చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన కొంతమంది ఆందోళనకారులు విధుల్లో ఉన్న పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరారు. దీంతో బహదూర్‌గూడ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి.
Hyderabad,Telangana














